రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు వారి పరిధిలోని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్జ్ అన్నారు. హైదరాబాద్ నుండి ఎన్నికలు, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు / పాలనాధికారులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో నియమించి ప్రత్యేక బృందాలు, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
దినపత్రికలు, ప్రసార మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉంటూ భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నోడల్ అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను నిశితంగా పరిశీలించాలని, ప్రతిరోజు సంబంధిత అంశాల నివేదికను తయారు చేయాలని, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు వెంటనే నివేదిక సమర్పించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే అభ్యంతరకర పోస్టులు, అపోహలు, పుకార్ల వ్యాప్తి, అనుమతి లేకుండా ప్రచారం జరిగే వీడియోలు, ఆడియోలు, పోస్టుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు పంపించాలని, రిటర్నింగ్ అధికారులు వివరాలను పరిశీలించి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లయితే తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించినా, సామాజిక మాధ్యమాలలో అనుకూల పోస్టులు పెట్టినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ చేపట్టడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని,
అత్యవసర పరిస్థితులలో విధులు, సర్వీసులు నిర్వహించే ఉద్యోగులకు భారత ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఈ నెల 15న ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఆరోజు అభ్యర్థులకు ఓటరు జాబితాలు అందించాలని, రిటర్నింగ్ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న ఓటర్ నమోదు ఫారాలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే అందించాలని, ఎన్నికల సంఘానికి నివేదిక పంపించవలసి ఉంటుందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ… జిల్లాలోని 002 -చెన్నూర్ (ఎస్.సి.), 003- బెల్లంపల్లి (ఎస్.సి.), 004- మంచిర్యాల నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లాలో చెన్నూర్ నియోజకవర్గంలో 227, బెల్లంపల్లి నియోజకవర్గంలో 227, మంచిర్యాల నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దిన పత్రికలు, కేబుల్ ఛానళ్ళలో ప్రసారమవుతున్న రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల సంబంధిత ప్రకటనలు, పెయిడ్ న్యూస్లతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, వీటికి సంబంధించిన నివేదికలను ప్రతి రోజున ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు పంపించి తద్వారా సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ
బృందాలను ఏర్పాటు చేశామని, చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఎన్నికల నిబంధనలకు లోబడి ఎలాంటి ఆధారాలు లేని నగదు, మద్యం, బంగారం ఇతరత్రా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను సీజ్ చేస్తామన్నారు.
ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధ యాప్తో పాటు ఆఫ్లైన్లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఎప్పటికప్పుడు అనుమతుల మంజూరుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ, జిల్లాలో పోలింగ్ శాతం పెంపొందే విధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.