వెనుకబడిన తరగతుల కులవృత్తుల వారికి ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు బి.రాహుల్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు లతో కలిసి వెనుకబడిన తరగతుల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వెనుకబడిన తరగతుల కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 14 రకాల కులవృత్తులు చేసుకునే జీవించే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లాలో 2 వేల 668 మంది అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయగా ప్రస్తుతం మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది లబ్దిదారుల చొప్పున జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో 900 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. మిగిలిన వారికి విడతల వారిగా అందిస్తామన్నారు. ఆర్థిక సహాయం పొందిన లబ్దిదారులు తాము చేస్తున్న కులవృత్తులను అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.
అనంతరం మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, ఇందులో భాగంగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం ద్వారా వెనుకబడిన తరగతుల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూత అందిస్తామని, అర్హత గల మైనార్టీలకు అందించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 19 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని, రేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల బియ్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్టిల కమీషనర్లు మారుతి ప్రసాద్, రమేష్, మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ఈసంపల్లి ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు,
లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.