Manda Krishna Madiga: గతంలో తెలంగాణ తల్లి రూపం మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ కవిత(Kavitha) రూపంలోనే ఉందంటూ ఎమ్మార్పీఎస్(MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బిడ్డ కవిత రూపమే తెలంగాణ తల్లి అయిందన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కవితపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ మీడియా సమావేశంలో నేను తెలంగాణ బిడ్డనే కదా, అందుకే తెలంగాణ తల్లి నా రూపంలో ఉండవచ్చు అంటూ కవిత చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అలాగే అప్పట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eashwar) నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా వచ్చారని తెలిపారు. కవిత చీర రంగు.. తెలంగాణ తల్లి విగ్రహం చీర రంగు ఒకటే అంటూ విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఏ రంగు జాకెట్ ఉందో.. కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ అని తెలిపారు. కవిత రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ విగ్రహానికి కిరీటం, వడ్డాణం ఉన్నాయని కానీ కవితకు లేవు అంతే అని మందకృష్ణ ఎద్దేవా చేశారు. మందకృష్ణ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
కాగా తెలంగాణ తల్లి విగ్రహం కవిత రూపంలో ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం విధితమే.