కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలతో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా అద్భుత మహా నగరంగా వెలుగొందనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలక్టరేట్ సమావేశ మందిరంలో నగర అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తో కలిసి సమీక్షించారు. స్మితా సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పడు ముందుండి కరీంనగర్ నగర అభివృద్ధికి పనిచేశారని, వారి తోడ్పాటుతోనే ప్రస్తుతం 14.5 కి.మీ. 100 ఫీట్ల రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నట్టు గుర్తుచేశారు.
దేశంలో సబర్మతి నది తరువాత అంతకుమించిన అభివృద్ది, అద్బుతాలతో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులను జిల్లాలో చేపట్టడుతున్నట్టు తెలిపారు. చైనా, సౌత్ కొరియాలోని సియోల్ తరువాత కరీంనగర్ జిల్లాలో దాదాపు 70 కోట్లతో అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తైతే పర్యటక శోభను ఆస్వాదించేందుకు మహానగరాల నుండి ప్రజలు కరీంనగర్ దారిపడతారని స్మిత సభర్వాల్ అన్నారు.