మండలంలోని ముప్పరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అక్షయ అగ్రి హార్వెస్టర్ల తయారీ పరిశ్రమను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అటవీ శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధిక ఆధునిక విధానాలతో తెలంగాణలో వ్యవసాయ రంగం ముందుకు వెళుతుందని అన్నారు.
రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారని,వారి పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి ఆధునిక యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు. పరిశ్రమలో రైతులు ఉపయోగించే వరి కోత యంత్రం, మొక్కజొన్న, కందులు తదితర పంటలను కోయడానికి ఉపయోగించే రోటోమీటర్ లతో పాటు ఇతర యంత్రాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.