ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందారు. మరో 17 మంది మావోయిస్టులు కూడా మృతిచెందినట్లు ఆ పార్టీ అధిష్టానం నిర్ధారించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఆయన పార్టీలో సేవలందించారు. ఒకేసారి 18 మంది మృతిచెందడం మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు నెలల కిందటే రాష్ర్ట కార్యదర్శిగా బాధ్యతలు చేపటిన చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ఉన్నది. ఆయనది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చొక్కారావుతో పాటు మరో తెలుగు నేత నర్సింహారావు రావు కూడా ఉన్నట్లు దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరిట విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
పోరుకన్నా ఊరు మిన్న అంటూ
గతేడాది డిసెంబర్ 28వ తేదీన కాల్వపల్లిలో ములుగు ఎస్పీ శబరీష్ పర్యటించారు. అడవిబాట పట్టిన నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లారు. పోరుకన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అంటూ నక్సలైట్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామోదర్ తల్లి బతుకమ్మను కూడా ఎస్పీ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బతుకమ్మకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. తన కొడుకును చూడాలని ఉందని, ఇంటికి రావాలని దామోదర్‌కు బతుకమ్మ పిలుపునిచ్చారు. ఇది జరిగిన 20 రోజుల తర్వాత చొక్కారావు మృతి చెందడంతో మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి.
బయటపడిన భారీ సొరంగం
మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్ అడవుల్లో స్పెషల్ పార్టీల కూంబింగ్ కొనసాగుతోంది. అడవులను జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఉన్న తుమిరెల్లి ప్రాంతంలో భారీ సొరంగం బయటపడింది. దీన్ని మావోయిస్టులు నిర్మించారని తేలింది. ఇది 10 అడుగుల లోతు, 50 మీటర్ల పొడవు ఉంది. తాళిపేరు నది సమీపంలో ఉన్న భారీ బంకర్‌లో మావోయిస్టులు సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు. బాంబులను ఇక్కడే తయారు చేసుకుంటున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. బంకర్‌లో గన్ ఫౌండ్రీ పరికరాలు, మందు గుండు సామగ్రి, విద్యుత్ తీగల లాంటివి లభించాయి. సొరంగం ఎవరికీ కనిపించకుండా పైన చెట్ల కొమ్మలతో కవర్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
30 ఏళ్లుగా ఉద్యమంలోనే
30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ వస్తున్న చొక్కారావు పార్టీలో అంచలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. చొక్కారావు ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉంటూ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం సైతం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. దామోదర్‌ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి. ఆయన సోదరుడు బడే నాగేశ్వర్ రావు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు.
సోదరుడి బాటలోనే
2008లో బడే నాగేశ్వర్‌రావు దంపతులు తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సోదరుడు నాగేశ్వర్ రావు అడుగు జాడల్లోనే విప్లవ బాటలో దామోదర్ నడిచారు. 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన దామోదర్ ఏటూరు నాగారం ఏరియా కమిటీలో చేశారు. ఏటూరు నాగారం ఎస్టీ హాస్టల్‌లో పదో తరగతి వరకు చొక్కారావు చదువుకున్నారు. ఈ ప్రాంతంపై దామోదర్ గట్టి పట్టు సాధించారు. మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, యాక్షన్ టీం కమాండర్‌గా వ్యవహరించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనాతో మరణించడంతో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అతడి స్థానంలో బడే చొక్కారావుకు 2021లో బాధ్యతలు అప్పగించింది.