Maoist Sujathakka Surrender to Police: మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, దివంగత అగ్రనేత కిషన్‌జీ భార్య, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క (60) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలోనే సుజాతక్కతో పాటు లొంగిపోయిన మిగతా మావోయిస్టులను కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మావోయిస్టుల లొంగుబాటుకు దారితీసిన కారణాలు, భవిష్యత్ కార్యాచరణను మీడియా ఎదుట పోలీసులు వివరించనున్నారు.
కేంద్ర కమిటీలోని ఏకైక మహిళా మావోయిస్టు..
కాగా, గద్వాల్ ప్రాంతానికి చెందిన సుజాతక్క చాలా చిన్న వయసులోనే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. 1984లో ఆమె మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మావోయిస్తు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు సుజాక్కనే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె లొంగుబాటు గురించి మధ్యాహ్నం డీజీపీ జితేందర్ మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/shashi-tharoor-comments-on-trump-tarrifs/
వైద్య పరీక్షల కోసం బయటికి వచ్చిన సమయంలో..
కాగా, కిషన్ జీ సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కిషన్ జీ భార్య సుజాతక్క సైతం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటూ పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె బయటికి ఎందుకు వచ్చారనే విషయం తెలియరాలేదు. అయితే, వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్ జోన్‌లో ఉంటున్నారా? అన్న సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఆమెను ఎప్పుడు? ఎక్కడ? అరెస్ట్ చేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం.


