Maoist ceasefire announcement : వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఉనికి కోసం పోరాడుతున్న మావోయిస్టు పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాంతి చర్చల విషయంలో కేంద్రం సుముఖంగా లేనప్పటికీ, తమ వైపు నుంచి మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక వ్యూహమేంటి..? భిన్నాభిప్రాయాల నడుమ, కేంద్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న వేళ మావోయిస్టులు ఈ శాంతిమంత్రం జపించడానికి కారణాలేంటి…? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం: జగన్ : ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. “తెలంగాణ సమాజం శాంతిని కోరుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు శాంతియుత వాతావరణం కోసం ఉద్యమించాయి. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, మే నెలలో మేము ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించాం. ఆ గడిచిన ఆరు నెలల కాలంలో మా వైపు నుంచి సంయమనం పాటిస్తూ, శాంతికి విఘాతం కలగకుండా చూసుకున్నాం,” అని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ సమాజం ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు (నవంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు) కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో మాదిరిగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా సహకరించాలని ఆయన కోరారు.
కేంద్రంపై తీవ్ర ఆరోపణలు : అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న ఈ శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతోందని జగన్ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్ణయం వెనుక మర్మమేంటి : ఒకవైపు ఆయుధాలు వీడి చర్చలకు రావాలన్న ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. మరోవైపు, పార్టీలోనే చర్చల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, వరుస ఎదురుదెబ్బలతో బలహీనపడిన మావోయిస్టు పార్టీ, కాల్పుల విరమణను పొడిగించడం వ్యూహాత్మక ఎత్తుగడగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరమణ ద్వారా ప్రజల్లో, ప్రజాసంఘాల్లో సానుభూతిని కూడగట్టుకోవడంతో పాటు, పార్టీని పునరుత్తేజం చేసుకోవడానికి సమయం దొరుకుతుందని వారు అంచనా వేస్తున్నారు.


