Fire accident: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురు మృతి చెందగా మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 11 ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి ఘాటైన వాసనలు రావడంతో ఫ్యాక్టరీ వైపు ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని ప్రొడక్షన్ యూనిట్లోని షెడ్డు పూర్తిగా కుప్పకూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి.
పరిశ్రమలో కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ ప్రాణనష్టం జరగడంతో ఆందోళనకు దిగారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.
