Matrimonial Fraud Prevention: జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వెతుకుతున్నారా..? అందమైన ఫొటో, ఆకట్టుకునే ప్రొఫైల్ చూసి మురిసిపోతున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి! మీరు చూస్తున్న ఆ ప్రొఫైల్ వెనుక ఓ పెద్ద మోసం దాగి ఉండొచ్చు. ఫోన్‌లోనే పెళ్లికి సై అంటూ తీయని మాటలు చెప్పి, మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే మాయగాళ్లు కాచుకు కూర్చున్నారు. రాజధానిలో పెరిగిపోతున్న ఈ ఆన్‌లైన్ పెళ్లిళ్ల మోసాల తీరుతెన్నులేంటి? ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయి? మోసపోయామని గ్రహించాక ఏం చేయాలి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే కానీ, మీరు సురక్షితంగా ఉండలేరు.
వలపు వల.. లక్షల దోపిడీ : పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త అవతారమెత్తారు. వీరి మోసాల తీరు ఒక పక్కా ప్రణాళికతో సాగుతోంది.
పాతబస్తీ యువకుడి ఉదంతం: పాతబస్తీకి చెందిన ఓ యువకుడు మ్యాట్రిమోనీ సైట్‌లో పాకిస్థానీ నటి ఫోటో చూసి, అదే నిజమైన అమ్మాయి అనుకున్నాడు. మాటలు కలిశాయి. కొద్దిరోజులకే, ‘మా అమ్మ ఆసుపత్రిలో ఉంది’ అంటూ కట్టుకథ అల్లి, అతని నుంచి ఏకంగా రూ. 21 లక్షలు కాజేసింది. తీరా పోలీసులను ఆశ్రయిస్తే, అది సైబర్ మోసమని తేలింది.
విశ్రాంత ఉద్యోగికి విరహం: చిక్కడపల్లికి చెందిన 68 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి, భార్య చనిపోవడంతో తోడు కోసం మ్యాట్రిమోనీ సైట్‌ను ఆశ్రయించారు. పరిచయమైన మహిళ, రకరకాల అవసరాలు చెప్పి పలు దఫాలుగా రూ. 7.75 లక్షలు వసూలు చేసింది. మరో లక్ష కావాలని అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి లబోదిబోమన్నారు.
ఎర వేసేదిలా : ఈ ముఠాలు ప్రధానంగా జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, విడాకులు తీసుకున్నవారు, వయసు పైబడిన ఒంటరి వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
నకిలీ ప్రొఫైల్స్: పురుషులను ఆకర్షించేందుకు అందమైన మోడల్స్, నటీమణుల ఫోటోలతో; మహిళలను బుట్టలో వేసుకునేందుకు డాక్టర్లు, ఐటీ నిపుణులు, ఎన్నారై వ్యాపారుల ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తారు.
నమ్మకం కలిగించడం: వాట్సాప్‌లో గంటల తరబడి చాటింగ్ చేస్తూ, పూర్తిగా తమ వైపు తిప్పుకుంటారు. విదేశాల్లో ఉన్నట్లు నమ్మించేందుకు అంతర్జాతీయ ఫోన్ నంబర్లు, గొంతు మార్చే యాప్‌లను కూడా వాడుతున్నారు.
కట్టుకథలతో దోపిడీ: బాగా దగ్గరయ్యాక, అసలు నాటకానికి తెరలేపుతారు. “కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు”, “బ్యాంకు కార్డులు బ్లాక్ అయ్యాయి”, “మీకోసం ఇండియాకు వచ్చి వ్యాపారం పెడతాను, కస్టమ్స్‌లో గిఫ్టులు ఆగిపోయాయి” వంటి కట్టుకథలు చెప్పి లక్షల్లో డబ్బులు గుంజుతారు. ఇటీవల బంజారాహిల్స్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ నుంచి ఇదే పంథాలో ఏకంగా రూ. 40 లక్షలు కాజేశారు.
బాధితుల్లో చాలామంది, విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని, పిల్లలు ఎక్కడ గెంటేస్తారోనని మౌనంగా ఉండిపోతున్నారు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళల చేతిలో 120 మంది విశ్రాంత ఉద్యోగులు మోసపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అప్రమత్తతే ఆయుధం: మోసపోతే ఏం చేయాలి : ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు ప్రస్తావన వస్తే వెంటనే అనుమానించాలి. ఒకవేళ మీరు మోసపోయినట్లు గ్రహిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి లేదా సైబర్ క్రైమ్ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి వివరాలు అందించండి. మీ ఒక్క ఫిర్యాదు ఎంతోమందిని ఇలాంటి మోసాల బారి నుంచి కాపాడుతుంది.


