Murder due to harassment and fear : భయం కొన్నిసార్లు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఎదుటివారి నుంచి ప్రాణహాని ఉందని భావించినప్పుడు, తమను తాము కాపాడుకునేందుకు ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. మెదక్ జిల్లాలో జరిగిన ఓ హత్య, ఈ నానుడికి అద్దం పడుతోంది. పదేపదే చంపుతానని బెదిరిస్తున్నాడు, తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు, అక్రమ కేసులు బనాయిస్తున్నాడన్న కోపంతో, అతడి నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదన్న భయంతో ముగ్గురు వ్యక్తులు ఏకమై వరుసకు సోదరుడైన వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. అసలు వారి భయానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు? అతని ఆగడాలు ఏంటి..? ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలేంటి..?
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, నేరచరితుడిగా పేరుగాంచిన ఉప్పరి యాదగిరిని, అతని దాయాదులే అయిన ఉప్పరి శ్యాముల్, రాములు, ఎల్లంలు కలిసి కట్టెలతో కొట్టి, బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు. యాదగిరి ఆగడాలు, వేధింపులు, బెదిరింపులు భరించలేకే ఈ దారుణానికి ఒడిగట్టామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు.
యాదగిరి నేరచరిత్ర.. కక్షలకు కారణాలు: పోలీసుల రికార్డుల ప్రకారం, మృతుడు యాదగిరిపై గతంలోనే హత్యాయత్నం కేసుతో పాటు పలు కేసులు నమోదై ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. నిందితుల్లో ఒకడైన ఉప్పరి శ్యాములు తమ్ముడు సిద్ధరాములుపై దారి విషయంలో కక్ష పెంచుకుని, కట్టెతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో నిందితుడైన ఉప్పరి రాములు సోదరుడు లక్ష్మణ్‌ను గొర్రెల దొంగతనం కేసులో అన్యాయంగా ఇరికించాడు. మూడో నిందితుడైన ఎల్లం భార్యను యాదగిరి తీవ్రంగా వేధించేవాడు. ఈ ఘటనలతో విసిగిపోయిన ముగ్గురూ యాదగిరిపై తీవ్ర కక్ష పెంచుకున్నారు.
హత్యకు దారితీసిన పరిణామాలు: తమ కుటుంబాలను వేధిస్తున్న యాదగిరిని పద్ధతి మార్చుకోవాలని శ్యాముల్, రాములు, ఎల్లంలు పలుమార్లు హెచ్చరించారు. అయితే, వారి మాటలను పెడచెవిన పెట్టిన యాదగిరి, ఎదురు మీ ముగ్గురినీ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇప్పటికే నేర చరిత్ర ఉన్న యాదగిరి అన్నంత పని చేస్తాడని, తమ ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని వారు భయపడ్డారు. “అతను ఏదైనా చేసేలోపే తామే ఏదైనా చేయాలని” నిశ్చయించుకున్నారు.
పథకం ప్రకారం, యాదగిరి చేష్టలను నిలదీసేందుకు ముగ్గురూ కలిసి అతని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముగ్గురూ, యాదగిరిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, కిందపడేసి కట్టెలతో విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం సమీపంలోని బండరాయిని తీసుకుని అతని తలపై మోదడంతో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు.
నిందితుల అరెస్ట్: “మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో వ్యక్తిగత కక్షల కారణంగానే దాయాదులైన ఉప్పరి రాములు, శ్యాములు, ఎల్లంలు కలిసి ఈ హత్య చేసినట్లు తేలింది. నిందితులు నేరాన్ని అంగీకరించారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం,” అని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.


