Saturday, November 15, 2025
HomeతెలంగాణSTUDENT PROTEST: "ఈ టీచర్ మాకొద్దు!".. పాఠాలు చెప్పని పంతులుపై విద్యార్థుల తిరుగుబాటు!

STUDENT PROTEST: “ఈ టీచర్ మాకొద్దు!”.. పాఠాలు చెప్పని పంతులుపై విద్యార్థుల తిరుగుబాటు!

Students protest against teacher : ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తుంటే, విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవడం చూశాం. కానీ, “ఈ టీచర్ మాకొద్దు, ఇక్కడి నుంచి పంపించేయండి” అంటూ విద్యార్థులే ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగిన వింత ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాలకు వచ్చినా పాఠాలు చెప్పకుండా, యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేస్తున్న ఓ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిపై, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరగబడ్డారు. అసలు కన్నారం ఉన్నత పాఠశాలలో ఏం జరుగుతోంది..? ఆ ఉపాధ్యాయుడిపై వస్తున్న ఆరోపణలేంటి..?

- Advertisement -

మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, కన్నారం ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ తీరుపై, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠాలకు డుమ్మా: “టీచర్ రోజూ స్కూల్‌కు వస్తారు, కానీ క్లాసులు చెప్పరు. ఒకవేళ చెప్పినా, మాకు ఏమీ అర్థం కాదు,” అని విద్యార్థులు వాపోతున్నారు.

అడిగితే బూతులు: “అర్థం కాలేదని అడిగితే, బూతులు తిడుతూ, మధ్యలోనే క్లాసులోంచి వెళ్లిపోతారు,” అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

క్లాసులో ‘జబర్దస్త్’: పాఠాలు చెప్పాల్సిన సమయంలో, ఆయన తన సెల్‌ఫోన్‌లో ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోలు పెట్టుకుని, పెద్ద సౌండ్‌తో చూస్తూ, ఇతర తరగతులకూ ఆటంకం కలిగిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

తల్లిదండ్రులను సైతం బెదిరింపులు : ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీయగా, ఆయన పొంతనలేని సమాధానాలు చెబుతూ, వారిని బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. “నాకు యూనియన్ లీడర్‌షిప్ ఉంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇష్టం వచ్చింది చేసుకోండి,” అంటూ ఆయన దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

“విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడం వాస్తవమే. ‘నేను యూనియన్ లీడర్‌ను, సీనియర్‌ను, నాకు పనులు చెప్పొద్దు’ అంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నాడు. తోటి ఉపాధ్యాయులపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెట్టిస్తూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.”
– శేషాద్రి, ప్రధానోపాధ్యాయుడు, కన్నారం ఉన్నత పాఠశాల

కలెక్టర్‌కు ఫిర్యాదు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న టీచర్ శ్రీకాంత్‌ను తక్షణమే బదిలీ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తీర్మానించారు. విద్యార్థుల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు, పాఠశాలకు చేరుకుని, వారికి నచ్చజెప్పడంతో, ప్రస్తుతానికి ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad