మేడారం మహా జాతరను పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 6వేల బస్సులలో భక్తులను మేడారం తరలించడం తిరిగి వారి గమ్యస్థానాలకు తరలించడం జరుగుతుందని, జాతరకు వచ్చే మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తింపు ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క )అన్నారు. శనివారం మేడారం గ్రామంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి మేడారం జాతర కోసం ప్రత్యేకంగా అరవై ఎకరాల స్థల విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన బస్ స్టాండు ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల బస్ లను నడపడానికి సిద్దంగా ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుందామని వివరించారు. ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ , వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.