చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇష్ట దైవంగా కొలిచే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం, నల్లగొండ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది కొండగట్టు దేవస్థానాన్ని దర్శించినప్పుడు 100 కోట్లు ప్రకటించి, ఒక్క పైసా కేటాయించలేదని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి, నల్లగొండ నరసింహ స్వామి దేవాలయానికి నిధులు కేటాయించాలని కోరారు.
చొప్పదండి నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ లెదర్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మిట్ట ప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గంలో కాలేశ్వరం ప్రాజెక్టు, ఎల్లంపల్లి పైప్ లైన్, ఎస్సారెస్పీ కెనాల్ నియోజకవర్గ రైతులు తమ విలువైన భూములను కోల్పోయారని, వరద కాలువ పై తూములు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని కోరారు.
గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ఎడమ కుడి కాలువ కు సంబంధించిన 90% పనులు 2014లోనే పూర్తయినాయని, 10లో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం 10% పనులను కూడా పూర్తి చేయలేదని, ఎడమ కుడి కాలువ పనుల పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరారు. కొడిమ్యాల మండలం పోతారం చెరువు కట్ట ఎత్తును పెంచాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటి మిడ్ మానేరు సమస్యల గురించి గతంలోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విన్నారని, ప్రభుత్వం వెంటనే మిడ్ మానేరు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
చొప్పదండి నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న గంగాధరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు, బాలికలకు సౌకర్యంగా ఉంటుందని, గంగాధర లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. గత ఏడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చొప్పదండి నియోజకవర్గం లో ని రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మత్తు చేయించాలని కోరారు. అనంతరం సీయం రేవంత్ రెడ్డిని అయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.