Meenakshi Natarajan Phone to Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండటంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని కొండా సురేఖకు ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. కాగా, మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆయనను తొలగిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు.. హైదరాబాద్‌లో కొండా సురేఖ ఇంటికి వెళ్లారు. సురేఖ నివాసంలోనే ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ తలదాచుకున్నారన్న సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అర్ధరాత్రి ఆమె నివాసానికి చేరుకున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత వారిని అడ్డుకొని నానా హంగామా చేశారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం అడ్వైజర్ వేమ్ నరేందర్ రెడ్డి వంటి నాయకులు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. “రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రెడ్డి నాయకులు మా బీసీ కుటుంబాన్ని అణచివేస్తున్నారు.” అని సుష్మిత అన్నారు. కొండా మురళిని కూడా అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతోందని, సుమంత్‌ను దానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలు..
కాగా, ఈ వ్యవహారం మంత్రి సురేఖ, పొంగులేటి మధ్య ఉన్న విభేదాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. మేడారం జాతరకు సంబంధించిన రూ.71 కోట్ల కాంట్రాక్టులపై వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సురేఖ ఆ కాంట్రాక్టుల్లో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీని తర్వాతే సుమంత్ తొలగింపు జరిగింది. ఇప్పుడు ఈ వివాదంపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారు. మీనాక్షి నుంచి సురేఖకు పిలుపు వచ్చింది. సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో సురేఖ అక్కడికి వెళ్లి, మీనాక్షిని కలవనున్నారు. ఈ సమావేశంలో ఆమె సుమంత్ వ్యవహారంలో కొండా కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై వివరణ కోరే అవకాశం ఉంది. సురేఖ మీనాక్షిని కలిసిన తర్వాత ఏమి జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.


