Mega Job Fair Huzurnagar : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈ అక్టోబర్ 25వ తేదీన బృహత్తరమైన “మెగా జాబ్ మేళా”ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉద్యోగాల పండుగ నిరుద్యోగ యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని, వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 150కి పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొననున్న ఈ మేళా ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుండటంతో, ఈ అవకాశాన్ని యువత ఎలా అందిపుచ్చుకోవాలి? ఏయే రంగాల్లో కొలువులు అందుబాటులో ఉన్నాయి..? వంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొలువుల జాతరకు సర్వం సిద్ధం : బుధవారం కోదాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మెగా జాబ్ మేళా వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరియు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ (DEET) సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
వివిధ రంగాల్లో విస్తృత అవకాశాలు : ఈ మెగా జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఈ-కామర్స్, తయారీ, బ్యాంకింగ్, బయోటెక్నాలజీ వంటి అనేక కీలక రంగాలకు చెందిన 150కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.టెక్, పీజీ, ఎంబీఏ, ఫార్మసీ వంటి విభిన్న విద్యార్హతలు కలిగిన యువతీ యువకులందరూ ఈ మేళాకు హాజరు కావచ్చు. అభ్యర్థుల సౌలభ్యం కోసం హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక కౌంటర్లు, ప్రింటింగ్ మరియు ఫోటోకాపీ సౌకర్యాలతో కూడిన హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 5,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
యువతకు మంత్రి ఉత్తమ్ పిలుపు : ఈ బృహత్తర అవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువత పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఈ జాబ్ మేళా నిర్వాహణపై సచివాలయంలో డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.


