కంటి వెలుగుపై గ్రామాలలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించాలని.. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. ఈనెల 19వ తేదీ నుండి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరు.. ముఖ్యంగా సర్పంచులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు పిలుపునిచ్చారు. కంటి వెలుగు నిర్వహణపై మంగళవారం ఆయన సర్పంచులు, ఎంపీఓలు ,వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచులు పూర్తి అంకిత భావంతో పనిచేస్తే కంటి వెలుగు విజయవంతం అవ్వడమే కాకుండా, వారికి గ్రామాలలో మంచి పేరు వస్తుందని అన్నారు.
కంటి వెలుగు పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించ వద్దని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాకు సుమారు 40 వేలకు పైగా కంటి అద్దాలు కూడా వచ్చాయని తెలిపారు. గ్రామాలలో ఒకేసారి అందరూ గుంపుగా కంటి పరీక్షల కోసం రాకుండా ముందుగానే స్లాట్స్ ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన సమయం ప్రకారం ప్రతి ఒక్కరు కంటి వెలుగు కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు.