Weather Forecast Update: తెలంగాణలో వచ్చే రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. 27 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి.లీలారాణి పేర్కొన్నారు.
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు: ఈ రోజు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
అతి భారీ వర్షాలు: 28వ తేదిన నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ పి.లీలారాణి అన్నారు.
29వ తేదిన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ పి.లీలారాణి తెలిపారు. ఈ నెల 30 తో పాటుగా అక్టోబర్ 1 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పొంగుతున్న వాగులు, నదులు: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులతో పాటుగా మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రోజంతా భారీ వర్షం కురిసింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 72.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 95.06 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ అధికారులు తెలిపారు.


