MGM Hospital Warangal services : ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య కల్పతరువుగా, పెద్ద దిక్కుగా నిలుస్తున్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోజూ వేలల్లో రోగులు వస్తుంటారు. అయితే, ఇంత పెద్ద ఆసుపత్రిలో ఏ విభాగానికి ఎటు వెళ్లాలో తెలియక, ఏ డాక్టర్ ఎక్కడుంటారో అంతుచిక్కక దూర ప్రాంతాల నుంచి వచ్చిన అమాయక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, రోగులకు సులువుగా, వేగంగా సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై ఏ వైద్య సేవకు ఏ గదికి వెళ్లాలో స్పష్టంగా తెలియజేస్తూ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలేమిటో, ఏ గదిలో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఓపీ చీటీపైనే రూట్ మ్యాప్ : ఇకపై ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు పడే అగచాట్లకు తెరపడనుంది. ఓపీ చీటీ తీసుకునే కౌంటర్‌లోనే రోగి తమ సమస్యను చెప్పగానే, వారు వెళ్లాల్సిన విభాగం పేరు, గది నంబరును చీటీపైనే స్పష్టంగా ముద్రించి ఇస్తారు. దీనివల్ల రోగులు అనవసరంగా ఆసుపత్రి ప్రాంగణంలో గదుల కోసం వెతుక్కుంటూ తిరగాల్సిన పని తప్పుతుంది. నేరుగా తమకు కేటాయించిన గదికి వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. ముఖ్యంగా చదువుకోని వారు, వృద్ధులు, మారుమూల గ్రామాల నుంచి వచ్చేవారికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడనుంది.
సేవల వివరాలు.. గదుల సంఖ్యలు ఇవే:
1, 2: ఓపీ చీటీ కౌంటర్లు
3: ఈఈజీ (మెదడు సంబంధిత పరీక్ష)
4: ఓపీ ఫార్మసీ (ఉచిత మందుల కౌంటర్)
5, 8: జనరల్ మెడిసిన్ ఓపీ (పురుషులు, మహిళలకు వేర్వేరుగా)
6: వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఓపీ
12, 13: ఎముకలు, కీళ్ల వ్యాధుల ఓపీ (పురుషులు, మహిళలకు వేర్వేరుగా)
19: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) సేవలు
30, 31: జనరల్ సర్జరీ ఓపీ (పురుషులు, మహిళలకు వేర్వేరుగా)
33: రుమటాలజీ (కీళ్లవాతం – మంగళ, శుక్ర), ప్లాస్టిక్ సర్జరీ (సోమ, గురు)
38: ఈసీజీ గది
39: కుక్కకాటు ఇంజెక్షన్ గది
41: జ్వరం ఓపీ
47, 91, 91/ఏ: రోగ నిర్ధారణ పరీక్షల ల్యాబ్
92: ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ
93: క్యాన్సర్ ఓపీ (ఆంకాలజీ)
97: ఫిజియోథెరపీ (పక్షవాతం, నడుము, మెడ నొప్పులకు)
100: షుగర్ వ్యాధి ఓపీ (బుధ, శుక్ర)
115, 116: చర్మ వ్యాధుల ఓపీ (పురుషులు, మహిళలకు వేర్వేరుగా)
119: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ విభాగం
124: మానసిక వైద్య సేవలు
131: దంత వైద్య సేవలు
150: సూపరింటెండెంట్ కార్యాలయం
ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్లు: వైద్యం అందించడంలో ఏదైనా సమస్య ఎదురైనా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే సూపరింటెండెంట్ (98499 03030) లేదా పీఆర్ఓ (94906 11938) నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
వివాదాల నేపథ్యంలో మార్పులు : ఇటీవల ఆక్సిజన్ సిలిండర్‌తో ఉన్న పసికందును వార్డుకు తరలించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించి, సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేశారు. ఆసుపత్రిని గాడిన పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రోగులకు మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.


