MGNREGS Livelihood Generation : పట్టణాలకు వలస వెళ్లకుండా, కన్న ఊరిలోనే ఉంటూ గౌరవంగా బతకాలని కలలు కంటున్నారా..? మీ కలలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సరికొత్త రూపంలో మీ ముందుకొచ్చింది. కేవలం చెరువులు తవ్వడం, మొక్కలు నాటడమే కాదు… ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రంలోనే పశువుల పాకలు, కోళ్ల షెడ్లు నిర్మించుకుని అదనపు ఆదాయం పొందే సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఈ పథకం కింద ఎలాంటి యూనిట్లు మంజూరు చేస్తారు..? ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు..? ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
వ్యవసాయానికి అనుసంధానం.. రైతుకు అండదండ : గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి, ప్రతి కుటుంబానికి ఏటా 100 రోజుల పని కల్పించడమే లక్ష్యంగా 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ప్రారంభమైంది. కాలక్రమేణా మారుతున్న అవసరాలకు అనుగుణంగా, గత రెండేళ్లుగా ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. దీని ద్వారా రైతులు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, నలుగురికి ఉపాధి చూపించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.
మంజూరయ్యే పనులు – ప్రభుత్వ సాయం : ఈ పథకం కింద రైతులు వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా పలు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కూలీ, సామగ్రి ఖర్చులతో కలిపి ప్రభుత్వం అందించే సహాయం వివరాలు.
పౌల్ట్రీ షెడ్లు: యూనిట్‌కు రూ. 85,000 మంజూరు చేస్తారు. ఈ నిధులతో షెడ్డు నిర్మించుకుని 100 నాటు కోళ్లను పెంచాల్సి ఉంటుంది.
పశువుల పాకలు: కనీసం 3 పశువులు ఉన్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, పాక నిర్మాణానికి యూనిట్‌కు రూ. 96,000 అందిస్తారు.
మేకలు/గొర్రెల షెడ్లు: 10 గొర్రెలు లేదా మేకలు ఉన్నవారికి షెడ్డు నిర్మాణం కోసం యూనిట్‌కు రూ. 98,000 వరకు సహాయం చేస్తారు.
వర్మీ కంపోస్టు గుంతలు: సేంద్రియ ఎరువుల తయారీ కోసం యూనిట్‌కు రూ. 15,000 అందిస్తారు.
అజొల్లా పెంపకం: పశువుల దాణాగా ఉపయోగపడే అజొల్లా పెంపకానికి యూనిట్‌కు రూ. 20,000 ఇస్తారు.
ఇంకుడు గుంతలు: భూగర్భ జలాలను పెంచే ఇంకుడు గుంతల నిర్మాణానికి యూనిట్‌కు రూ. 6,500 మంజూరు చేస్తారు.
దరఖాస్తు విధానం సులభం : అర్హులైన రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ మండల కార్యాలయంలోని ఉపాధి హామీ ఏపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)ని గానీ, లేదా గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శిని గానీ సంప్రదించాలి. అవసరమైన ధ్రువపత్రాలతో పాటు మీకు కావాల్సిన యూనిట్ కోసం దరఖాస్తు పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. అధికారులు దానిని పరిశీలించి పనులు మంజూరు చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,43,090 జాబ్‌కార్డులతో 2,63,466 మంది కూలీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
“ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడే అనేక పనులను మంజూరు చేస్తున్నాం. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా మండలాల్లోని సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తులు అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరం.”
– నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి


