Telangana Minister Adluri Laxman: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మారుతీ నగర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ టోయింగ్ వాహనం ఢీకొట్టడంతో ముందు చక్రం ఊడిపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో వాహనాన్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద వివరాలు:
శుక్రవారం సాయంత్రం 8–9 గంటల మధ్య మెట్‌పల్లి మండలం మారుతీ నగర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కోరుట్ల నియోజకవర్గ పర్యటన ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన టోయింగ్ వాహనం ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు ముందు చక్రం ఊడిపోవడంతో వాహనం కొద్దిసేపు అదుపు తప్పింది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వెంటనే కారును ఆపగలిగాడు. కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, మంత్రితో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంత్రిని మరో వాహనంలో సురక్షితంగా ఇంటికి తరలించారు. సమాచారం అందుకున్న మెట్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన జరిపారు.