Adluri hot comments on ponnam: మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదని తెలిపారు. పొన్నం ఆయన తప్పు ఇప్పటికైనా తెలుసుకుంటాడని అనుకున్నా అని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తాను పక్కనే కూర్చుంటే లేచి వెళ్లిపోవడమేంటని పొన్నంను ప్రశ్నించారు. సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్‌ను సైతం నిలదీశారు. మాదగిలు అంటే అంత చిన్న చూపా అని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ను కలుస్తానని లక్ష్మణ్ తెలిపారు.
అసలేం జరిగిందంటే: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఇన్‌ఛార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి అందరూ వచ్చారు.. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో పలు వ్యాఖ్యలు చేప్పినట్లు మీడియా సమావేశంలోని మైక్‌లో రికార్డు అయ్యింది. అందులో మీడియా సమావేశానికి సహచర మంత్రిని ఉద్దేశించి.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.
నిమిషాల్లో వైరల్: మరో మంత్రి లేకుండా ప్రెస్‌మీట్ ఎలా మొదలుపెడుతామని మెనార్టీ నేతల్లో కొందరు వెనుకముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్ అందుకొని మీరు మాట్లాడుతారా.. నన్ను మాట్లాడుమంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. మీడియా సమావేశం కవరింగ్ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. నిమిషాల్లోనే అది వైరల్ అయింది. దీంతో నాలుక కరుచుకున్న పొన్నం ప్రభాకర్ ఖండన ప్రకటన సైతం చేశారు.


