KomatiReddy Counter to Harish Rao: ప్రజల మేలు కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ‘మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు గట్టి కౌంటర్ వేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 40వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని ఈ సందర్భంగా మీడియా ఎదుట హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.
‘విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్ళిపోయిన హాస్పిటల్స్ నిర్మాణ పనులను ఈ 21నెలల్లో వేగంగా చేపడుతున్నాం. నిత్యం ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షిస్తూ రేయింబవళ్లు పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 40వేల కోట్ల బకాయి పెట్టిపోయారు.. అది మేము చెల్లిస్తున్నాం.’ అని కోమటిరెడ్డి అన్నారు.
సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని అక్టోబర్ 31 కి ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పినట్లు మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. అల్వాల్ హాస్పిటల్ వద్ద 1000 మంది ఒకే షిఫ్టులో పనిచేస్తున్నారని.. వచ్చే మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని 2026 జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి పనులను రూ. 2వేల కోట్లతో చేపడుతున్నామని.. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
కాగా, వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రజలకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష నేతలు రాజకీయం కోసం పర్యటనలు చేస్తూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం మేము చిత్త శుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


