Konda Couple Meet with CM Revanth Reddy: దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వచ్చిన వారు రేవంత్‌రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణల గురించి కొండా దంపతులు సీఎంకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం పాల్గొన్నారు.
పార్టీ నేతలపై ఆరోపణలు: ఇటీవల మంత్రి కొండా సురేఖకు సంబంధించిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌పై వచ్చిన ఆరోపణలు, ఆ తరువాత పోలీసులు ఆయన అరెస్టు కోసం మంత్రి నివాసానికి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నేడు సీఎం రేవంత్ రెడ్డితో కలిశారు.
కుమార్తె సంచలన ఆరోపణలు: కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద చోటుచేసుకున్న హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించగా.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి నివాసం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రి కుమార్తె కొండా సుస్మితా పటేల్ పోలీసులను అడ్డుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సుస్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైనా కొండా దంపతులు సీఎం రేవంత్‌కు వివరణ ఇచ్చేందుకు భేటీ అయినట్లు సమాచారం.


