Minister Konda Surekha fire on Ponguleti: అధికార పార్టీలోని మంత్రుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలు మరువకముందే.. పొంగులేటి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. అయితే వారి విభేదాలకు గల కారణాలేంటో తెలుసుకుందాం!
మేడారం టెండర్లలో జోక్యమే కారణం: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం మితిమీరుతోందని కాంగ్రెస్ అధిష్ఠానానికి సురేఖ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని మంత్రి పీఆర్‌ఓ మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కార్యాలయానికి వారు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పీఆర్ఓ పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో పొంగులేటి జోక్యం ఎక్కువ అయినట్లు కొండా దంపతులు మల్లికార్జునఖర్గేకు తెలిపినట్టు సమాచారం. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/minister-adluri-laxman-hot-comments-on-ponnam-prabhakar/
మొదటి నుంచే విభేదాలు: తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. కాగా ఇటీవల చేపట్టిన మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో పొంగులేటి జోక్యం మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.71 కోట్లతో చేపట్టిన మేడారం పనుల టెండర్‌లను తన మనుషులకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తుండడమే .. మంత్రుల విభేదాలకు కారణమని తెలుస్తుంది. దీంతో పొంగులేటి జోక్యం ఇతర శాఖల్లో ఎక్కువ అయినట్లు కొండా మురళి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ పరిణామం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే జాతర పనులపై తాము ఎవరిపైనా.. ఎవరికీ ఫిర్యాదు చేయలేదని కొండా మురళి అన్నట్లు తెలుస్తోంది. ఏ మంత్రితోనూ తమకు విభేదాలు లేవని కొండా సురేఖ భర్త తెలిపారు. విభేదాలు అనేవి కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని అన్నారు.


