Saturday, November 15, 2025
HomeతెలంగాణCall Centres for Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్‌సెంటర్

Call Centres for Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్‌సెంటర్

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్‌ను గురువారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ 1800 599 5991ను ఆవిష్కరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంట‌ల నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుంద‌న్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి కాల్ సెంటర్‌ను వినియోగించుకోవ‌చ్చని తెలిపారు. లబ్ధిదారుల ఫోన్, ఆధార్ నెంబర్ ఆధారంగా వివరాలను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటార‌ని చెప్పారు. నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఫొటోలు అప్ లోడ్ చేయడంలో సిబ్బంది ఆలస్యం, సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తుందన్నారు.

- Advertisement -

సమస్యను సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని, లబ్ధిదారులకు ఆయా వివరాలు తెలియచేస్తార‌ని వివ‌రించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఏఐ విరివిగా వాడుతున్నామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పేదలకు ఇండ్ల నిర్మాణానికి స‌హాయం అందిస్తోంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ విపి గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad