Jubliee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దృష్టిని కేంద్రీకరించాయి. త్వరలో రానున్న ఉపఎన్నికకు అన్నీ పార్టీలు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నాన్ లోకల్ వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు.
దీంతో ప్రస్తుతం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన అజారుద్దీన్‌తో పాటు స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, ఫిరోజ్ ఖాన్ తదితరులు రేసులో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నలుగురు కూడా స్థానికులే కావడం కావటంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
కాగా, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప్పఎన్నిక అనివార్యమైందన్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్‌పై విజయం సాధించిన గోపీనాథ్.. ఈ ఏడాది జూన్ 8 అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అయితే తమ స్థానాన్ని తామే దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే గత 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్.. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోనూ గెలిచి రాజధానిలో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.


