లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)మతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం కులగణన అని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఆయన అభిమతమని వెల్లడించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం సరిదిద్దడానికి రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీసీ కులగణన కోసం పట్టుబడుతున్నారని గుర్తుచేశారు.
కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ను ఎవరేం చేయలేరని హెచ్చరించారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో..కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. కాగా రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం.. రాహుల్ గాంధీ తల్లి క్రిస్టియన్ అయితే.. బ్రాహ్మణుడు ఎలా అవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.