శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య వాడివేడి చర్చ జరిగింది. మండలిలో కవిత(Kavitha) మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. ఆమె విమర్శలకు మంత్రి సీతక్క(Seethakka) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణ పరువు తీసింది కల్వకుంట్ల కుటుంబమే అన్నారు. తమకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవని.. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అయితే.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు.
పదేళ్ల పాలనలో ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మొదటి ఐదేళ్ల పాలనలో మంత్రివర్గంలో మహిళలు లేరని.. మహిళా కమిషన్‌కు సభ్యులు లేరని గుర్తుచేశారు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదని.. పావలా వడ్డీ ఇవ్వలేదని..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారని ప్రశ్నించారు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందిపెడితే.. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచమ్మచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు.