Seethakka Counter To KTR Comments: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. విదేశాలకు పోయిన కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టారని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్ధం కానట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నారని.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చిద్దాం అంటే.. ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏంటి? అని ప్రశ్నించారు.
ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది ప్రెస్‌క్లబ్‌లో చర్చించడానికి కాదని గుర్తుచేశారు. డెడ్ అయిన బీఆర్ఎస్ పార్టీ.. డెడ్‌లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి పార్టీ నాయకుడు 72 గంటల డెడ్‌లైన్ అంటూ అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సొంత చెల్లి కవితనే నాయకుడిగా గుర్తించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారా..? సమస్యలపై చర్చిద్దాం అంటే భయమెందుకు అని సీతక్క నిలదీశారు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 18నెలల పాలనలో రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు రూ.500 బోనస్ పథకాలతో రైతు రాజ్యమని నిరూపించామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచింది ఎవరో పార్లమెంట్‌లో లేదా అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. ఈ చర్చకు ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు.
తాజాగా రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. తెలంగాణ రైతులకు ఎవరు ఏం చేశారో చెప్పేందుకు తాను చర్చకు రెడీ అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈనెల 8వ తేదీన సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌కు ఛాలెంజ్ చేశారు. చర్చకు ప్రిపేర్ కావడానికి 72గంటల సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ పెట్టారు. రేవంత్ సొంత ఊరు కొండారెడ్డి పల్లి, నియోజకవర్గం కొడంగల్, కేసీఆర్ సొంతూరు చింతమడక అయినా తాను చర్చకు రెడీ అన్నారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.