ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Seethakka) స్పందించారు. కార్యకర్తల శ్రమతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని విమర్శించారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసనమండలిలో మాట్లాడొచ్చని సూచించారు. ఏ పార్టీ చేయని కులగణను తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని ఆమె మండిపడ్డారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Jana Reddy) మాట్లాడుతూ కులగణన అంశంలో తన పాత్ర లేదని తెలిపారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పారు. తప్పు చేసిన వాడిని కూడా క్షమించే గుణం తనదని… తనను తిట్టినా పట్టించుకోనని అన్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వాలు అడిగితేనే తాను సలహాలు ఇస్తానని పేర్కొన్నారు.
కాగా అంతకుముందు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి.. బీసీ వర్గాలను అణచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను మాట్లాడింది తప్పు అయితే.. మళ్లీ కులగణనకు ఎందుకు సమయం ఇచ్చారు? అని ప్రశ్నించారు. బీసీ నేతలు కష్టపడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పేరును తోటి మంత్రులు కూడా గుర్తు ఉంచుకోవడం లేదని ఎద్దేవా చేశారు.