Minister Vakiti Srihari: సినీ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. బోడుప్పల్ పరిధిలోని ఆర్‌బీఎం ఆసుపత్రిలో ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఫిష్ వెంకట్ అనారోగ్యం గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం ప్రస్తుతానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయనను పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. తన నటనతో తెలంగాణ యాసతో వెండితెరకు పరిచయమైన నటుల్లో వెంకట్ ఒకరిని కొనియాడారు. కింది స్థాయి నుంచి తన కళానైపుణ్యం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి నటన కొనసాగించాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రితో పాటు పరామర్శించిన వారిలో స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రితం ఉన్నారు.
కాగా ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఇప్పటికే పాడవ్వడంతో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ మార్పిడి చేయించాలని నిర్ధారించారు. ఇందుకు రూ.50లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే తమ దగ్గర అంత డబ్బు లేదని సినీ పెద్దలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: ప్రభాస్ రూ.50 లక్షలు ఇవ్వలేదు? ఫిష్ వెంకట్ భార్య ఏం చెప్పిందంటే?
ఈ క్రమంలోనే ఆపరేషన్‌కు కావాల్సిన సాయం అందిస్తామని ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ అసిస్టెంట్ అంటూ ఓ వ్యక్తి నుంచి తమకు ఫోన్ వచ్చిందని.. కిడ్నీ దాతను వెతుక్కోండని ప్రభాస్ మిగిలిన ఖర్చులు భరిస్తారని చెప్పారని వెంకట్ కుమార్తె తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని వాపోయారు. దయచేసి సినీ పెద్దలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీహరి ఆయనను పరామర్శించి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం తరపున భరిస్తామని హామీ ఇచ్చారు.