తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతని కొడుకు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేయగా.. 10 రోజుల క్రితమే గచ్చిబౌలిలోని ఓ ఎంఎన్ సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
వరుసకు మేన బావ అయిన గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ.. రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు. నవంబర్ 20న పనిమీద ఊరు వెళ్లిన నవీన్.. తిరిగి సోమవారం ఉదయం నగరానికి వచ్చాడు. ప్లాట్ తలుపులు మూసి ఉండటంతో పలుమార్లు తలుపు తట్టారు. లోపలి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. అనుమానంతో తన వద్దనున్న మరో కీ తో తలుపులు తెరిచాడు. బెడ్రూంలో అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించడంతో షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు అక్షయ్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అక్షయ్ ఆత్మహత్యకు గల కారణాలేవీ తెలియరాలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ.. గతంలో అక్షయ్ ఓ కేసులో అరెస్టయ్యాడు. మహబూబ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సెప్టెంబరు 30న పోలీసులు అక్షయ్ సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికొచ్చాడు. అరెస్ట్ విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.