Sunday, November 16, 2025
HomeతెలంగాణTG Farmers: తుఫానుతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం.. ఒక్కో ఎకరాకు రూ.10 వేల సాయం..!

TG Farmers: తుఫానుతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం.. ఒక్కో ఎకరాకు రూ.10 వేల సాయం..!

Minister Tummala Announces Rs 10,000 per Acre compensation for crop losses: తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. మొంథా తుఫాను ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంటలు నీట మునిగిపోయాయి. తెలంగాణలో 4.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామన్నారు. పశుసంపద, ఇళ్ళు నష్టపోయినా ఆదుకుంటామని తెలిపారు. అలాగే 80 లక్షల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల పేర్కొన్నారు. మార్కెట్‌లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేందుకు ఆదేశించామని.. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-area-not-in-the-part-of-jubilee-hills-constituency/

రేపటి నుంచి రైతుల వివరాలు నమోదు..

మరోవైపు, రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతు వివరాలను నమోదు చేయనున్నారు. పశు సంపద , ఇళ్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని, దీని గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి సాయం అందిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులను ఆదుకుంటామని చెప్పారు. గతేడాది వరదల్లోనూ భారీగా పంట నష్టం జరిగినప్పటికీ కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కేంద్రానికి లెక్కలు చెబుతామని.. కానీ గత ఏడాది చెప్పిన దానికే ఇంకా స్పందించలేదని తుమ్మల వివరించారు. ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలించిన అనంతరం మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే..

ఇక, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. శుక్రవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి.. ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుఫాను కారణంగా పంట నష్టంపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పంట నష్టం, తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశించిన సీఎం.. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad