Telangana Agriculture Minister on urea crisis : తెలంగాణ యూరియా సంక్షోభంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ ముందుచూపులేనితనమే కారణమని ఆయన ఘాటుగా విమర్శించారు. క్యూలైన్లలో పడిగాపులు కాస్తూ, రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న రైతుల దుస్థితికి కేంద్రం వైఫల్యమే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కేంద్రంపై మంత్రి తుమ్మల విమర్శనాస్త్రాలు: రాష్ట్రంలో యూరియా కొరతపై స్పందించిన మంత్రి తుమ్మల, ఈ సమస్యకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు.
దేశవ్యాప్త సమస్య: ఇది కేవలం తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. ఆ ప్రభావం తెలంగాణపైనా పడింది” మంత్రి తుమ్మల అని ఆయన అన్నారు.
దిగుమతిలో వైఫల్యం: కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేదని మంత్రి తుమ్మల అన్నారు. సకాలంలో ఇతర దేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోలేకపోయారని తెలిపారు. ఆ ఫలితాన్ని ఇప్పుడు దేశంలోని రైతులందరూ అనుభవిస్తున్నారని మంత్రి తుమ్మల తీవ్రంగా విమర్శించారు.
కోటాలో కోత: “ఆగస్టు నెలలో రాష్ట్రానికి రావాల్సిన పూర్తి యూరియా కోటా రాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ నెల కోటా కూడా ఇప్పటికీ అందలేదు. దీనిపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో తేల్చుకుంటాం: కేంద్రం దృష్టికి ఈ సమస్యను బలంగా తీసుకెళ్లే ఉద్దేశంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ ప్రయాణమవుతున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల కడగండ్లు: మరోవైపు, క్షేత్రస్థాయిలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తెల్లవారకముందే సహకార సంఘాల వద్ద పడిగాపులు కాయడం, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, తోపులాటలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, యూరియాను అందుబాటులోకి తీసుకురాకపోతే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


