CM review on local body elections: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సహచర మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్‌రెడ్డి అంతర్గతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా వెంటనే జీఓ జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. దీనిపై స్పష్టత వచ్చాక, మరో మూడు, నాలుగు రోజుల్లో సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికలకు వెళ్లడమే మంచిది: సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే.. బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీఓ జారీ చేసి ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న అవకాశాలను పరిశీలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒకవేళ న్యాయపరమైన అడ్డంకులు ఎదురైతే.. పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా చర్చలు జరిగాయి. భాజపా రాజకీయ కారణాలతో బిల్లుల ఆమోదానికి సహకరించకపోవచ్చని అంచనాకు వచ్చారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/new-dialysis-centers-in-telangana/
ఆ తర్వాత వెళ్లడమే ఉత్తమం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే చట్ట ప్రకారం రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడం మంచిదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎంకు సూచించారు. హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఈ నెల చివరిలోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించారు. తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారు. దానిపై కొందరు మంత్రులు స్పందిస్తూ.. హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఈ నెల చివరిలోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని సూచించారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని ప్రభుతం హైకోర్టును కోరాల్సి ఉంటుందనే దానిపైనా సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డికే వదిలేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


