Telangana BC Reservations HC stay: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రులు పొన్నం, వాకిటి విడివిడిగా స్పందించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/high-court-stay-on-bc-reservations/
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్, సబ్ కమిటీ వేసింది. కేబినెట్ ఆమోదంతో శాసన సభలో చట్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు గవర్నర్‌కు పంపించాం. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి కూడా సవరణ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు.’ అని మంత్రి పొన్నం వెల్లడించారు.
హైకోర్టు నిర్ణయంతో బీసీల నోటికాడ ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్ నేతలే అని ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లను అడ్డుకుందని మండిపడ్డారు. హైకోర్టు స్టే విధించకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించామని మంత్రి వాకిటి వివరించారు.


