అంబులెన్స్ సైరన్(Ambulance Siren) వింటే ఎంతటి ట్రాఫిక్‌లోనైనా సరే ప్రజలు దారిస్తారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారేమో.. రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే చికిత్స అందిస్తే ప్రాణాలకు నష్టం ఉండదని భావిస్తారు. అందుకే సైరన్ వినిపించగానే దారి ఇచ్చేస్తారు. అయితే ఇటీవల అంబులెన్స్ సైరన్‌లను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. లోపల పేషెంట్స్ లేకపోయినా సరే డ్రైవర్లు సైరన్ కొడుతూ స్పీడ్‌గా వెళ్లిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే పంజాగుట్ట సర్కిల్ దగ్గర అతి వేగంగా సైరన్‌తో వస్తున్న ఓ అంబులెన్స్‌ను తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అంబులెన్స్ డోర్లు ఓపెన్ చేసి చూస్తే లోపల పేషెంట్ లేరు. ఓ కుక్క ఉంది. దీంతో షాక్ అయిన పోలీసులు పేషెంట్స్ లేకపోయినా ఎందుకు వేగంగా వెళ్తున్నావ్ అని డ్రైవర్‌ను ప్రశ్నించారు. తన యజమాని ఇంట్లో పెంచుకునే కుక్కకు మియాపూర్ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు తీసుకెళుతున్నానంటూ సమాధానం ఇచ్చాడు. రోగులను తరలించేందుకు వాడాల్సిన అంబులెన్స్ సైరన్ ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని మండిపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు యజమాని మీద కేసు నమోదు చేశారు.