Komatireddy Rajagopal Reddy: తనపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, పుకార్లు పుట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. వాటిని తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం అవినీతి గురించి తానే మొదట అసెంబ్లీలో ప్రస్తావించానని, కానీ తాను అనని మాటలను కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయని ఆయన ఆరోపించారు.
కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు వ్యాపింపజేస్తూ తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో ఆయన కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cpi-narayana-slams-kcr-jagan-assembly-boycott/
‘నేను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని ఇలా రకరకాలుగా వార్తలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పాను. అలా చెప్పడం కూడా తప్పేనా.? ఈ రోజు కూడా గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుంటే వైసీపీ అధినేత జగన్‌ను కలవడానికి వెళ్తున్నానని వదంతులు సృష్టిస్తున్నారు.’ అని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో మీడియా సమావేశం పెట్టి చెబుతానని, అప్పటివరకు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


