MLA Komatireddy RajagopalReddy Conditions To Liquor Shops: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ లక్ష్యంగా వరుసగా హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మద్యం షాపులను కేవలం 4 గంటలు మాత్రమే తెరవాలని ఆదేశించారు. తన నియోజకవర్గంలో దీన్ని అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మరోసారి బల్ల గుద్ది చెప్పారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లక్కీ డ్రా నిర్వహించగా.. మునుగోడు నియోజకవర్గం పరిధిలో షాపులు దక్కించుకున్న వ్యాపారులు రాజగోపాల్‌రెడ్డిని కలిశారట. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘‘మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు చెల్లవు. నా సొంత పాలసీలే మునుగోడులో అమలవుతాయి’’ అని ఎమ్మెల్యే వ్యాపారులకు ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్త మద్యం పాలసీ మునుగోడులో చెల్లదంటూ లిక్కర్ వ్యాపారులకు షరతులు విధిస్తున్నారట. తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా జారీ చేశారట. ఆయన పెట్టిన కండీషన్లలో మొదటది వైన్స్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం 1 గంటకు షాపులు తెరవాలి. రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాలి. రెండవది పర్మిట్ రూమ్‌లు పగటిపూట మూసేయాల్సిందే.. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేసి వైన్స్ షాపుతో పాటే క్లోజ్ చేయాలి. మూడవది.. బెల్టు షాపులకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు. నా ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారట. నియోజకవర్గంలోని 159 గ్రామాల్లో ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేస్తానని, ఈ టీమ్స్ బెల్టుషాపులపైన నిఘా పెడ్తాయని, లిక్కర్ వ్యాపారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఈ షరతులు, తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారట. ఇప్పుడు ఎమ్మెల్యే కండీషన్లపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్ర ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే నిబంధనలు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెల్టు షాపులను నియంత్రించాలని, మద్యం అమ్మకాలు తగ్గించాలని ఆది నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. గత 20 నెలల్లో బెల్టుషాపులకు లిక్కర్ వెళ్లకుండా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా నిలబెట్టాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. రెండేళ్లలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా వెనకబడ్డ మునుగోడులో మద్యపాన నిషేధం పక్కాగా అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. తన ఆశయానికి అందరూ సహకరించాలని తనదైన శైలిలో లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారట. మొత్తానికి మద్యం వ్యాపారులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కొత్త నిబంధనలు పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.


