తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Mahipal Reddy) కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ను ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
కాగా ఇటీవల మహిపాల్ రెడ్డి కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉండటంపై కాంగ్రెస్‌లోని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పార్టీ పెద్దలు సర్దిచెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సమయంలో తన ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేముందని మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు అసెంబ్లీలో తన పాత బాస్ కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయా అనే చర్చ మొదలైంది.