అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్ లో అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంనకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అగ్రంపహాడ్ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మోడల్ జాతరగా ఉండాలన్నారు. భక్తులు ఏలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు కనుక అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతర సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు తాగునీరు, స్నానాల కోసం నీటి సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జాతరకు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, మహిళా పోలీసు సిబ్బంది ఎక్కువ గా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తగినన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని పెంచాలన్నారు. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని, చెత్తాచెదారం త్వరితగతిన ట్రాక్టర్ల ద్వారా తరలించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు,ప్లాస్టిక్ సంబంధించిన ఇతరత్రాలను దుకాణదారులు అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతరకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అగ్రంపహాడ్ జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల 18వ తేదీ నాటికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. నిర్ణీత సమయానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరకు మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక అందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను త్వరలో తగుతున్న పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, డీసీపీ రవీందర్, పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, దేవాదాయ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఆర్ అండ్ బి, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
MLA Revuri Prakash Reddy: అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయండి
పోటెత్తనున్న లక్షలాది మంది భక్తులకు సకల సదుపాయాలు