హుస్నాబాద్ ఎంపీడీవో ఆఫీసులో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలు సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని ఇందులో ప్రజాప్రతినిధులందరి పాత్ర అభినందనీయం అలాగే హుస్నాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కోసం అత్యధిక అత్యధిక నిధులు తెచ్చుకున్నామని రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు, సామాజిక భవనాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు, నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసుకున్నామని, నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించుకున్నామని అలాగే కాలువలపై చెక్ డ్యాములు నిర్మించుకున్నందున ప్రతి గ్రామంలో బావులు పుష్కలంగా జలకలతో ఉన్నాయని తద్వారా పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హులైన అందరికీ అందిస్తామని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే గారు తెలిపారు. అక్కన్నపేట మండలంలోని కొన్ని గ్రామాలు ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్ మండలంలో కలపాలని కోరినందున ఆయా గ్రామాలను త్వరలో హుస్నాబాద్ మండలంలో కలుపుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. హుస్నాబాద్ మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని మన ఊరు- మనబడి కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నామని విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించుకున్నామని కాళేశ్వరం నీళ్లు గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకువచ్చామని త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. కొంతమంది గౌరవెల్లి ప్రాజెక్టు పై ఓర్వలేని తనంతో కుట్రపూరితంగా కేసులు వేశారు అయినా విజయవంతంగా ప్రాజెక్టును పూర్తి చేసాము ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు అదికూడా త్వరలో వీగిపోతుంది కేసు వేసిన వారు ఎవరైనా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అయినా ఆలోచించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి , ఏఎంసి చైర్పర్సన్ రజిని , వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.