MLC Jeevan Reddy| తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ రాష్ట్ర నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలతో తాను మానసిక్ష క్షోభ అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత అగౌరవం దక్కం అవమానకరంగా భావిస్తున్నట్లు వాపోయారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేధనలో ఉన్నానని.. ఆ ఆవేదనతోనే పార్టీ పెద్దలకు లేఖ రాస్తున్నట్లు ఆయన వివరించారు. సంఖ్యాబలంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారని.. అయినా కానీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం సమంజసం కాదని మండిపడ్డారు. ఇకనైనా ఫిరాయింపులను ప్రోత్సహించకుండా నైతిక విలువలు పాటించాలని కోరారు. పార్టీ ఫిరాయింపుదారులకి ముఠా నాయకుడు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆరోపించారు.పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టీ… ఫిరాయింపుదారులదే పూర్తి బాధ్యత అంటూ తీర్మానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
పోచారం అధ్యక్షతన ఫిరాయింపుదారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) సమావేశం అవ్వడం.. పార్టీతో పాటు ప్రభుత్వంలో వారికే బాధ్యతలు ఇవ్వడం సరికాదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన తాను.. ఇటీవల పార్టీలో చేరిన జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) తీరుతో ఇబ్బందులు పడుతున్నానని ధ్వజమెత్తారు. సంజయ్ ప్రోద్భలంతోనే తన ప్రధాన అనుచరుడిని దారుణంగా హత్య చేశారని ఆరోపణలు చేశారు. తన అనుచరుడిని చంపిన వ్యక్తి పక్కా కాంగ్రెస్ వ్యతిరేకి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో పార్టీ మారి.. కాంగ్రెస్ ముసుగు వేసుకుంటే ఎట్లా..? అని నిలదీశారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనలకు భిన్నంగా.. కేసీఆర్(KCR) అనుసరించినట్టే కాంగ్రెస్ నాయకులు కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏం చెప్పారు.. మనం ఏం చేస్తున్నాం? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణపై మీరే మార్గదర్శకం చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. కాగా ఇటీవల జగిత్యాలతో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారం గంగారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పెద్దల తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.