ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించారు. మహాలక్ష్మీ కింద రూ. 2500 ఇవ్వడంతో పాటు గత 12 నెలల కాలానికి గానూ బాకీ పడ్డ రూ. 30 వేలు కూడా చెల్లించాల్సిందేనని అన్నారు.
అంతే కాకుండా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పెంచని కారణంగా బాకీ పడ్డ రూ. 24000 వేలు కూడా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.
రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయినా నాగార్జున సాగర్ డ్యాం సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వెల్లడించారు. ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ అధీనంలోకి తేలేదని విమర్శించారు. తెలంగాణ నీళ్ల మీద రేవంత్ రెడ్డి ఆయన గురువుని ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సీఎం అయిన తర్వాత ఆరు నెలల పాటు ఒక్క ప్రాజెక్టు లోనూ స్పూన్ మట్టి కూడా తియ్యలేదని కవిత ఎద్దేవా చేశారు.