బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాజకీయ దినచర్యని ప్రారంభించినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న అదానీ కేసులపై మోదీని ప్రశ్నించిన ఆమె, ఈరోజు బీసీల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతను చాటుకోవాలని సూచించారు.
శుక్రవారం ఆమె తెలంగాణ జాగృతి నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ… సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు… విద్య, ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి బీసీ కమిషన్‌కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించి, అణగారిన వర్గాల అవసరాలను తీర్చడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దేశ సామాజిక స్వరూపాన్ని మాత్రమే బలోపేతం చేస్తుంది అని కవిత అభిప్రాయపడ్డారు. సమావేశానికి సంబంధించిన ఫోటోలను, వివరాలను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.