హైదరాబాద్‌లో నేటి నుంచి జరగనున్న మిస్ వరల్డ్(Miss World Event) పోటీలను వాయిదా వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా 72వ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను వాయిదా వేయడాన్ని పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమయంలో జాతీయ ఐక్యత, శాంతి, భద్రతపై మన దృష్టి ఉండాలి” అని రాసుకొచ్చారు.
మరోవైపు పలువురు ప్రముఖులు సైతం మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఏమైనా జరగకూడని సంఘటనలు జరిగితే ప్రపంచం ముందు తెలంగాణతో పాటు భారత్ పరువు పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పోటీల నిర్వహణకే సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది.