Kavitha| మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపలు రేపుతోంది. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి(Chittem Rammohan Reddy) ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్మోహన్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగనూరు జడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్టులకు తెరలేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ గడ్డ.. పోరాటాల పురిటి గడ్డ. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల తిరుగుబాటును అణిచివేయాలని అనుకోవడం మూర్ఖత్వం” అంటూ కవిత మండిపడ్డారు.