Weather Forecast Update: బంగాళాఖాతం తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం రోజు భాగ్యనగరంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో తేలికపాటి వర్షం కురుసే అవకాశం ఉందని అన్నారు. మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాసు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 – 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచానా వేశారు.
నగర వాసులకు నరకం: గత పది రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం కాగానే కారుమేఘాలు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాహనదారులు తెగ ఇబ్బందికి గురవుతున్నారు. హైదరాబాద్‌లో పది నిమిషాల సేపు వర్షం పడినా మెయిన్ రోడ్లు మొదలుకుని బస్తీ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో నగర వాసులు నరకం చూస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుండి భాగ్యనగరంలో చెదురుమదురు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. అయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: వర్షాలు పడిన ప్రతిసారి రేవంత్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూనేఉంది. ప్రస్తుతం కూడా అవసరానికి తగ్గట్టుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


