Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడనున్నాడు. హైదరాబాద్ నగరంలో మరోసారి వాన కురుస్తోంది. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ తాజా అప్‌డేట్: అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడింది. అయితే, దాని ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వాలి ఉందని వాతావరణ శాఖ వివరించింది.
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మరియు నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మరియు జోగులాంబ గద్వాల జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read:https://teluguprabha.net/telangana-news/maoist-partys-historic-move-ready-to-drop-weapons-for-peace/
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలి.
అధికార యంత్రాంగం అప్రమత్తం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను జాగ్రత్తగా చూసుకోవాలని.. వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


